ఆదివారం, డిసెంబర్ 27, 2015

రాత్రి ఈ‌టి‌వి 20వ వసంతం ప్రోగ్రామ్ Youtube లో చూస్తుంటే మన గాన గాంధర్వుడు ఎస్.పి.బాల సుబ్రమణ్యం గారు రామోజీరావు గారి గురించి కొన్ని విషయాలు చెప్పి కళ్ళనీళ్ళ పర్యంతమయి ఆయన కాళ్లపై పడి నమష్కరించే సన్నివేశం చూసి నా మనసు చలించిపోయింది. ఒకసారి బాల సుబ్రమణ్యం గారు ఎయిర్ పోర్ట్ లో దిగి కారు కోసం ఈనాడు ఆఫీస్ కి ఫోన్ చేస్తే ఎవరూ ఫోన్ ఎట్టలేదట! సరే అనుకుని రామోజీ రావుగారింటికి ధైర్యం చేసి ఫోన్ చేస్తే రామోజీ రావుగారు ఫోన్ ఎత్తారట. చెప్పండి బాల సుబ్రమణ్యం గారు అని అడిగితే ఏమి చెప్పాలో బాలుగారికి అర్ధకాలేదట! గుండెల్లో దడ పట్టుకుందట. రామోజీరావుగారు రెట్టించి అడిగేటప్పటికి బాలు గారు నానించుతూ కారు కోసం ఫోన్ చేశాను సర్. ఆఫీస్ కి ఫోన్ చేస్తే ఎవ్వరూ లిఫ్ట్ చేయక పోతే మీ ఇంటికి చేశానని ధైర్యం చేసి చెప్పేసారట! దానికి రామోజీరావుగారు అర్రెరే ఈరోజు సెలవు కారణంగా డ్రైవర్లందరూ వెళ్లిపోయారే! అయినా పర్లేదండి ఒక డ్రైవర్ ఉన్నాడు. అయితే కారు డ్రైవ్ చేసి చాలా రోజులయ్యింది. వస్తాడు లెండి అంటే "ఎవరండీ ఆ డ్రైవర్?" అని బాలు గారు అడిగారట. నేనేనండీ అన్నారట రామోజీ రావుగారు. దానికి అవాక్కయ్యారట బాలుగారు. రామోజీరావుగారు కారు తీసుకు వచ్చారట. ఇటువంటి సంఘటనలు ఎన్నో ఆయన జీవితంలో ఉన్నాయి. ఆయనకు గర్వం కానీ, ఆడంబరం గానీ ఏ కోశానా కనిపించవు. మేధావులు తక్కువుగా మాట్లాడతారనడానికి రామోజీ రావు గారే ఒక ఉదాహరణ. ఆయన ఎప్పుడూ చిర్నవ్వుతోనే కనిపిస్తారు గాని పెద్దగా మాట్లాడరు. ఆయన నిరంతర తపస్వి.
      ఏది ఏమైనా రామోజీ రావు గారు ఒక చారిత్రక మనిషి. ఆయన ఆ స్థితికి రావడమంటే మామూలు విషయం కాదు. తెలుగు బాష అభివృద్ధి కోసం ఎంతో తపించే రామోజీరావు గారు మన తెలుగు జాతి గర్వించదగ్గ ఒక మహానుభావుడు.

1 కామెంట్‌:

Popular Posts

Recent Posts