వ్యక్తిత్వ వికాసానికే పెద్ద ప్రతీక "వినాయక విగ్రహం" | The "Vinayaka Statue" is a big symbol of personality development
మన పూర్వీకులు కొన్ని గొప్ప, గొప్ప విషయాలను తాళ పత్రాల ద్వారా చిత్రాల ద్వారా,విగ్రహాల ద్వారా మనకు తెలియజేయడం కోసం పొందుపరచిన ఎన్నో దాఖనాలు ఇప్పటికీ మనముందున్నాయి. వాటిలో ఒక ప్రధానమైనది వినాయకుని విగ్రహం. నిజానికి మన పూర్వీకులు విగ్రహాల ద్వారా విజ్ఞానాన్ని నేర్పాలని చూసారు తప్ప అజ్ఞానాన్ని కాదు. అయితే కాలక్రమేణా అసలు విషయాలు అంతరించి పోయి "విగ్రహాలు పూజలందుకోవడం" ప్రారంభమయ్యాయి తప్ప వాటి ద్వారా మనం నేర్చుకోవాల్చిన జ్ఞానాన్ని మాత్రం మనం వదిలిపెట్టేసాము.వినాయకుని విగ్రహం - మనకిచ్చే వ్యక్తిత్వ వికాసపు సమాచారం ఏమిటి?
ఏనుగు తల, ఏక దంతం, భారీ బొజ్జ వంటి వాటితో కూడిన వినాయకుని విగ్రహం హిందూ విగ్రహాలలో అన్నిటికంటే ఎక్కువ విమర్శలకు గురవుతుంది. వాస్తవానికి ఆ విగ్రహం అవ్యక్తుడైన దైవంపై విశ్వాసానికి, మానవతా విలువలకు సంకేతం. సాధారణ వాడుక భాషలో తెలివైన వాళ్ళను ఉద్దేశించి వారిది పెద్ద తల అని అనటం మనం వింటుంటాం. అవ్యక్తుడైన దేవుడు అత్యంత జ్ఞానవంతుడు అనే విషయం తెలుపటానికే వినాయకుని విగ్రహానికి భారీ తల పెట్టడం జరిగింది. అంటే వినాయకుని భారీ తల జ్ఞానానికి ప్రతీకన్నమాట.అదే విధంగా మనిషి ప్రతిభను మెరుగుపరిచే అంశాలలో విషయాన్ని సావధానంగా వినటం అనేది ఒకటి. సావధాన చిత్తులను చెవులు చేటలుగా చేసుకుని వింటున్నాడని అంటుంటాం. ఇతరులు చెబుతున్న విషయం పట్ల సావధాన చిత్తులై ఉండాలని చెప్పటానికే వినాయకుని చెవులను అంత పెద్దవిగా చిత్రీకరించారు మన పూర్వీకులు. అలానే ముక్కుసూటిగా మాట్లాడటం అనేది నైతిక విలువలలో అత్యంత ప్రధానమైనది. మనసులో సకల చెడు భావనలు కలిగి యుండి పైకి మాత్రం చాల గొప్ప భావనలు కలవారిగా నటించటం ఎంతో హేయమైన విషయం. ఇలాంటి రుగ్మతకు దూరంగా ఉండమని తెలియజేయడానికే వినాయకుని ముక్కుని తొండంగా పెట్టారు మన పూర్వీకులు. సృష్టికర్త ఒక్కడు అనే సందేశాన్ని భద్రపరచడానికే వినాయకుని విగ్రహానికి ఒకే దంతం పెట్టడం జరిగింది.
ఒకరిలోని లోపాలను మరొకరి ముందు చెప్పటం అనేది అత్యంత ఘోరమైన అవలక్షణం. దీని కారణంగానే వ్యక్తుల మధ్య మనస్పర్ధలు, కొట్లాటలు జరుగుతుంటాయి. ఇతరుల లోపాలను బహిర్గతం చేసే అవలక్షణాలను కడుపునొప్పి, పొట్ట పేలి పోవడంలాంటి తదితర మాటలతో పోల్చటం చూస్తుంటాం. ఇతరుల రహస్యాలను గుప్తంగా ఉంచటం అనేది నైతిక విలువలకు పరాకాష్ఠ. ఇతరుల తప్పులను కడుపులో దాచుకోమని చెప్పడానికే వినాయకుని విగ్రహానికి భారీ బొజ్జ (పొట్ట)ను పెట్టడం జరిగింది.
అంతేకాక వినాయకుడిని చూసి చంద్రుడు అవహేళన చేస్తూ నవ్వాడని అందుకే వినాయక చవితి రోజున చంద్రుని చూడకూడదనే ప్రచారం వింటుంటాం. ఎయా విషయం చూసి కొందరు చంద్రుడు ఒక గ్రహం కదా? గ్రహం నవ్వడం ఏమిటి? అని ఎగతాళిగా ప్రశ్నించడం మనకు విదితమే. వాస్తవానికి ఈ సంఘటన ద్వారా మన పూర్వీకులు ఎంత మనోహరమైన సమాచారాన్ని తెలియజేస్తున్నారో చూడండి. ఇతరుల బాహ్యాన్ని చూసి అవహేళన చేసేవారిని సమాజం నుండి దూరంగా ఉంచాలని, వారితో మాట్లాడకుండా ఉండటం మాత్రమె కాదు కనీసం కన్నెత్తి కూడా చూడకూడదనే సమాచారాన్ని తెలియజేయడానికే ఆ కధను కల్పించడం జరిగింది తప్ప నిజంగానే చంద్రుడు వినాయకుని చూసి నవ్వాడని కాదు.ఇతరులలోని బాహ్యాన్ని చూసి హేళన చేయడం కాదు అంతర్గతంగా ఉన్న విశిష్టతలను గుర్తించటమే విజ్ఞత అన్న సమాచారం అందులో దాగి ఉంది. ఇలా అనేక ధార్మిక, నైతిక విలువలకు ప్రతీకగా వినాయకుని విగ్రహాన్ని గుర్తించడం విజ్ఞానం అవుతుంది. అలాకాక ఆ వినాయకుని విగ్రహమే సాక్షాత్తు ఆ అవ్యక్త దేవుడని భావించి, దానినే వేడుకుంటే అది అజ్నానమవుతుంది. ఏవిధంగా అయితే బ్రోమిన్ కు కేవలం సంకేతం మాత్రమే అయిన Br2ను సాక్షాత్తు బ్రోమిన్ అని అనుకోవటం ఎంత అజ్ఞానమో ఇదీ అంతే!!!
0 Comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి