మంగళవారం, ఏప్రిల్ 20, 2021

 Nice message for today's situation | నేటి పరిస్థితులకు చక్కని సందేశం. 

Nice message for today's situation
Nice message for today's situation

అది ఒక జింకల వనం. అందులో జింక జాతులు ఆనందంగా నిర్భయంగా జీవిస్తున్నాయి .

ఒకసారి ఆ వనం నుంచి ఒక జింక దారితప్పి వేరే అడవిలోకి వెళ్ళింది. అక్కడ దానికి ఎన్నో కొత్త కొత్త జంతువులు, తోడేళ్ళను, పులులను, సింహాలను, నక్కలను తొలిసారి అక్కడే చూసింది.

అక్కడ ఒక కొమ్ముల జింక ఎదురై " ఓ జింక సోదరా ఈ అడవిలో నిన్నెప్పుడూ చూడలేదే " అంది.

"అవును మాది జింకలవనం " అంది.

" ఈ అడవి మీ జింకల వనం లాంటిది కాదు. ఇక్కడ మనల్ని చంపి తినే క్రూర మృగాలు ఉన్నాయి. వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో మీకసలు తెలియదు. కాబట్టి ఇక్కడి నుండి త్వరగా వెళ్ళిపో " అంటూ ఆ జింక గెంతుతూ వెళ్ళి పోయింది.

" పిరికి జింక నేనూ జింకనే అదెలా తప్పించుకుందో నేనూ అలాగే తప్పిచుకోగలను " అనుకుంటూ జింకల వనం జింక ముందుకు వెళ్ళింది.

అక్కడ చెట్టు కింద నిద్రపోతున్న సింహం కనిపించింది. జింక చిన్నగా దాని దగ్గరికి వెళ్ళి తన ముందరి గిట్టతో సింహం తోక తొక్కింది .

 సింహానికి మెలకువ వచ్చింది. బద్దకంగా లేస్తూ జింకను చూసి గర్జించింది. ఆ గర్జన విని జింకకు గుండె ఆగినంత పనయింది .

వెనుదిరిగి వచ్చిన దారినే పరుగు పెట్టింది. అడవిని దాటి జింకల వనం వైపు పరుగు తీస్తూనే  వుంది. జింకల వనం సమీపానికి రాగానే సింహానికి చిక్కింది. సింహం దాన్ని చంపి చీల్చి ఆరగించింది .

 తరువాత సింహం లేచి మెల్లగా జింకల వనంలోకి వెళ్ళింది. దానికి అది క్రొత్త ప్రదేశం . అక్కడ దానికి గుంపులు గుంపులుగా జింకలు కనిపించాయి. సింహం ఆనందానికి అంతు లేదు. దొరికిన జింకను దొరికినట్టు చంపి తినేస్తుంది .

కొత్తగా ముంచుకొచ్చిన ఈ మృత్యువును చూసి జింకలన్నీ భయపడి పోయాయి. చెల్లాచెదురు అయ్యాయి. పొదల్లో దాక్కున్నాయి. బిక్కుబిక్కు మంటూ బతుకుతున్నాయి .

పొ‌రపాటున ఏ జింకయినా బయటికొస్తే చాలు సింహం దాన్ని పడగొట్టేస్తుంది .

అయితే ఆ జింకల్లో తెలివయిన కుర్ర జింక ఒకటుంది. దాని పేరు జ్ఞాన నేత్ర. జింకల పెద్దలు జ్ఞాన నేత్ర దగ్గరికి వచ్చి "దీనికి పరిష్కార మార్గం ఏమిటి " అని అడిగాయి.

" జింక పెద్దలారా నేనూ అదే ఆలోచిస్తున్నాను. ఈ క్రూర జంతువును ' సింహం ' అని అంటారు. దీని పంజా నుంచి తప్పించుకొనే చాకచక్యం మనకు లేదు.

ఎటు ఆలోచించినా. . ఎంత యోచించినా ఒకే ఒక్క దారి కనిపిస్తుంది.

ఈ సింహం ఆహారం లేకుండా

14 రోజులు మాత్రమే బ్రతక గలదు. కానీ మనం 21రోజులు బ్రతకగలం.

కాబట్టి మన జింకలన్నీ తమ పొదల్లోకి దూరి 14రోజులు బయటకు రాకుంటేచాలు దాని పీడ మనకు విరగడౌతుంది. మనలో ఎవరైనా నిర్లక్ష్యంతో బయటకు వచ్చి దానికి చిక్కారా దాని జీవిత కాలం మరో 14 రోజులు పెంచినట్లే.

ఈ రోజు అమావాస్య ఇప్పుడే పొదల్లోకి దూరిపోదాం. పున్నమి నాటికి బయటకు వద్దాం. తమ పొదల నుండి బయటకు రాకుండా చూసే బాధ్యత ఆ జింకల పెద్దలదే" అంది.

జింకలన్నీ జ్ఞాన నేత్రం మాటలు విన్నాయి. ఆకలితో అలమటించాయి.

పున్నమి వచ్చింది. జింకలన్నీ ఒక్కొక్కటే భయం భయంగా బయటకు వచ్చాయి. వనం మధ్య చెట్టు కింద చచ్చి పడి ఉన్న సింహాన్ని చూశాయి. ఆనందంతో అరిచాయి, గెంతాయి. జింకల కేరింతలతో వనం అంతా పులకరించింది.

ఇది ప్రస్తుత పరిస్థితులకు కరెక్టుగా సరిపోయింది కదా.. 

అందుకే..

ఇంట్లోనే ఉండండి 

కరోనా రక్కసి పనిపట్టండి... మనం జింకలకన్నా తెలివైనవాళ్ళమేగా

How to generate passive income: idea No:1

0 Comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Popular Posts

Recent Posts